Tuesday, December 30, 2014

విద్యుత్‌ సవరణ బిల్లుతో డిస్కంలకు ఉరి

 విద్యుత్‌రంగంలో ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణల అమలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. వినియోగదారుల ప్రయోజనాలను ఎరగా వేసి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు దోచిపెట్టేందుకు అడ్డగోలు నిబంధనలతో రూపొందించిన డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ పథకానికి చట్ట రూపం ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం లోక్‌సభలో 2014 విద్యుత్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్రంలో గత యుపిఎ సర్కారు అమలు చేయాలనుకున్న విధానాలనే కేంద్రంలోని బిజెపి సర్కారు కొనసాగిస్తోందనడానికి ఇదో ఉదాహరణ. కేంద్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీలు వేరైనా వాటి విధానాలు ఒక్కటే. అప్పటి యుపిఎ సర్కారు అసంపూర్తిగా వదిలేసిన బిల్లుల్నే ఇప్పటి మోడీ ప్రభుత్వం చట్ట రూపంలోకి తెస్తోంది. దానిలో భాగమే డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణతో
కూడిన తాజా బిల్లు. ముసాయిదా రూపంలో ఉన్నప్పుడే రాష్ట్రాలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెంచి బలవంతంగా అప్పటి యుపిఎ సర్కారు ఆమోదం పొందేలా చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదం లభించడానికి చాలా సమయమే పట్టింది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఒకే కారణంతో దీన్ని చాలాకాలం కేంద్ర ప్రభుత్వం తెరపైకి తేలేదు. చివరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013 మార్చి 7వ తేదీన అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు దీనికి అంగీకరించింది. అప్పట్లో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ఉద్యోగుల్లో విభజన తెచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అప్పటి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, హర్యానాలు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దేశవాప్తంగా డిస్కంలు రూ.2.46 లక్షల కోట్ల నష్టాల్లో ఉన్నాయని, వాటిని ఆదుకునేందుకే దీన్ని తెచ్చామని యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. దీనివెనుక ఉన్న షరతులను మాత్రం వెల్లడించలేదు. ఈ సవరణ బిల్లు చట్ట రూపంలోకి వస్తే ఏడాది లోపు ట్రాన్స్‌కో, డిస్కంల ప్రైవేటీకరణపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. సంస్కరణల అమలు, ప్రైవేటీకరణకు అడ్డురాకుండా ఉండేందుకు ఆయా డిస్కంల పరిధిలోని కోర్టు కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యుత్‌ శాఖతో ఒప్పందం నాటికి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు డిస్కంలకు ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక ఈ బకాయిలను కూడా పంచుకున్నారు. వీటిలో తెలంగాణ వాటా దాదాపు రూ.12,500 కోట్లు. ప్రభుత్వ శాఖల నుంచే డిస్కంలకు రూ.1,635.67 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. రాజకీయ అవసరాల కోసం డిస్కంల ద్వారా అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయించి, వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టింది. ప్రభుత్వ పాపాల ఫలితంగా ఏర్పడిన నష్టాలను పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పునర్వ్యవస్థీకరణ పేర ఇప్పుడు డిస్కంల ఉనికినే బలిచేసేందుకు సిద్ధపడింది! యుపిఎ సర్కారు ఈ పథకంలో 90 శాతం గ్రాంట్‌గా ఇస్తామని పేర్కొంటే, మోడీ సర్కార్‌ దీనిలో భారీగా కోత విధించింది. గ్రాంట్‌ను 60 శాతానికి కుదించింది. 10 శాతం డిస్కంలు, 30 శాతం రుణాలుగా సమకూర్చుకోవాలంటూ రాష్ట్రాల డిస్కంలపై పెను ఆర్ధిక భారాన్ని మోపింది.
పునర్వ్యవస్థీకరణ అంటే...
           విద్యుత్‌ వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం పెట్టుకున్న ముద్దుపేరు ఇది. ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వాటాగా రూ.12,500 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి వచ్చింది. వీటిపై డిస్కంలు బ్యాంకర్లకు వడ్డీలు చెల్లిస్తున్నాయి. బ్యాంకర్ల వడ్డీరేటు 9 నుంచి 11.50 శాతం వరకు ఉంది. ఇది డిస్కంలకు ఆర్థిక భారంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రపంచబ్యాంకు ఆదేశాల అమల్లో భాగంగా కేంద్రం ఈ స్కీంకు రూపకల్పన చేసింది. డిస్కంల అప్పుల్లో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. మిగిలిన అప్పుల్ని పైన పేర్కొన్న నిష్పత్తిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. విద్యుత్‌ ఛార్జీల పెంపు, ఆస్తుల అమ్మకం, తదితర మార్గాల్లో డిస్కంలు వీటిని సమకూర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము తిరిగి చెల్లింపుకు మూడేళ్ల మారిటోరియం ఉంటుంది. ఆ తర్వాత ఏడేళ్లలో వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాలి. వడ్డీరేటు 6 నుంచి 7 శాతంగా ఉంటుంది. ఏడాది లోపు డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం షరతులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. ఏ సంవత్సరం ఏఏ సంస్కరణలను, ఏ విధంగా అమల్లోకి తెస్తామనే వివరణ ఇవ్వాలి. దీని కోసం సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి సాంకేతిక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలపై ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్‌ నియంత్రణా మండలి (ఇఆర్‌సి) నుంచి అనుమతులు తీసుకోవాలి.
ఇవీ షరతులు
-  డిస్కంలు, ట్రాన్స్‌కోలోని ఉద్యోగుల సంఖ్యను దశలవారీగా కుదించాలి. అవసరమైన చోట్ల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కూడా తొలగించి, ప్రైవేటు భాగస్వామ్యానికి సహకరించాలి.
-  డిస్కంలు 50 శాతం నిధులను సమకూర్చుకోవడం కోసం విద్యుత్‌ ఛార్జీలను పెంచాలి. తమ ఆధీనంలోని మిగులు భూములను అమ్మేయాలి. ట్రాన్స్‌కో ఆధీనంలో ఒక్కో సబ్‌స్టేషన్‌కు అనుబంధంగా కనీసం ఒక ఎకరా భూమి ఉంటుందని అంచనా. వాటన్నింటినీ అమ్ముకునేందుకు డిస్కంలకు అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
-  దశలవారీగా విద్యుత్‌ నిర్వహణను ప్రైవేటుకు ఫ్రాంఛైజ్‌లుగా ఇవ్వాలి. తొలి విడతలో ఆస్తుల నిర్వహణ, రెండో విడతలో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫారాలు, పోల్స్‌ సహా అన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలి. దీని కోసం బిడ్డింగ్‌ నిర్వహించాలి. 
-  డిస్కంల పరిధిలో ఆస్తులు, లాభాలు వచ్చే సరఫరా వ్యవస్థలను ఫ్రాంఛైజీల పేర ప్రైవేటుకు కట్టబెడ్తారు.
ప్రైవేటుదే హవా
            డిస్కంల పునర్వ్యవస్థీకరణ పేర విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ప్రజలపై భారాలు తీవ్రంగా ఉంటాయి. గుజరాత్‌ సహా ఒడీశా, ఢిల్లీ, మహారాష్ట్రలో ఫ్రాంఛైజ్‌లు ఇచ్చారు. ఇప్పుడక్కడి ప్రభుత్వాలు, విద్యుత్‌ నియంత్రణా మండళ్లను (ఇఆర్‌సి) ఫ్రాంచైజీలే శాసిస్తున్నాయి. గతంలో ఢిల్లీలో విద్యుత్‌ ఛార్జీలను పెంచాలని అక్కడి ప్రైవేటు విద్యుత్‌ సంస్థలు (ఫ్రాంఛైజ్‌లు) ఇఆర్‌సిని కోరాయి. ఆయా సంస్థల ఆస్తిఅప్పుల పట్టీల్లో లాభాలు ఎక్కువగా ఉండటం గమనించిన ఇఆర్‌సి అందుకు అంగీకరించలేదు. దీనిపై స్వయానా అక్కడి ప్రభుత్వం ఇఆర్‌సిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు సంస్థల లాభాలతో ఇఆర్‌సికి సంబంధం లేదని, జాతీయ విద్యుత్‌ టారిఫ్‌ విధానం ప్రకారం రేట్లు పెంచాల్సిందేనంటూ ఇఆర్‌సి ఎదుట వాదించింది. ఓసారి ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాక వాటిని పోషించేందుకు ప్రభుత్వాలు ఇలాంటి వాదనలకు దిగి ప్రైవేటు పెట్టుబడికి కాపలా కాయాల్సిన దుస్థితికి చేరుకుంటాయి.
ప్రభుత్వం ఏం చేస్తుంది?
             ఉమ్మడి రాష్ట్రంలో డిస్కంల పునర్వ్యవస్థీకరణకు అప్పటి ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వరంగ పరిరక్షణకు తెలంగాణా సర్కార్‌ ఖచ్చితంగా ఈ బిల్లును వ్యతిరేకించాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం పయనిస్తుందో లేదో వేచిచూడాలి!

- ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

No comments:

Post a Comment