Tuesday, December 30, 2014

బీమా రంగానికి ''బీమార్‌'' చేస్తోందా?

బీమారంగం ప్రైవేటీకరణ అనంతరం, గడిచినదశాబ్దంన్నర కాలంలో భారత ప్రజలు విదేశీ ప్రైవేటు కంపెనీల తీరుతెన్నులను చాలా మేర తెలుసుకోగలిగారు. ఆ కారణం చేతనే వారు ప్రభుత్వ బీమా సంస్థలకు పట్టం కడుతున్నారు. ఆదరణచూపుతున్నారు. విశ్వసిస్తున్నారు. మరి అటువంటప్పుడు, నేడు మన ఎన్‌డిఎ పాలకులు ఆర్డినెన్స్‌ల ద్వారా విదేశీ బీమా కంపెనీలకు ఎర్ర తివాచీలు పరవడం ఎందుచేత?
             షేర్‌ మార్కెట్లకు సానుకూల సంకేతం ఇవ్వడం కావచ్చును..! లేదా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థల మెప్పు కోసం కావచ్చును!! లేదా త్వరలో మనదేశ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంతృప్తి పరిచేందుకు కూడా కావచ్చును!!!

          బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర వేసింది. దీనితో పాటు బొగ్గు రంగానికి సంబంధించి కూడా ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ బిల్లులపై ప్రభుత్వం ఆమోదముద్రను పొందలేకపోయింది. ఆ కారణం చేత, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ, పార్లమెంటు సమావేశాలు ముగిసిన 24 గంటలలోనే ఈ రెండు అంశాలపై ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం తెచ్చింది. బీమారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు 2008 నుంచి పార్లమెంటు ముందు ఉంది. కాగా, నాడు ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఈ బిల్లుకు సెలక్ట్‌ కమిటీలో అభ్యంతరాలు చెప్పింది. బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల మనం ఆశించిన ప్రయోజనాలేవీ లభించవనీ, అలాగే దీని వల్ల ప్రపంచంలో నెలకొని ఉన్న అర్థికమాంద్య పరిస్థితుల ప్రభావం మనదేశానికి కూడా సోకవచ్చుననేది సెలక్ట్‌ కమిటీ ముందు వచ్చిన అభ్యంతరాలుగా ఉన్నాయి. కానీ, బిల్లు పట్ల గతంలోని తన తీరును సునాయాసంగా మరచిపోయిన బిజెపి నేడు ఈ బిల్లుకు నిర్లజ్జగా ఆర్డినెన్స్‌ రూపం ఇచ్చింది. పైగా, గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పలుమార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేసిందనే కుంటి సాకులను నేడు బిజెపి నేతలు చెబుతున్నారు.
పాలకవర్గాలు - వాదనలు
           కాగా, బీమారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే లభించే ''ప్రయోజనాలు'' గా కాంగ్రెస్‌, బిజెపిలు మూడు అంశాలను చెబుతూ వచ్చాయి. అవి : 1. ఈ విదేశీ సంస్థలు మన బీమారంగంలోకి అవసరమైన పెట్టుబడులను తీసుకొస్తాయి. 2. దేశంలో బీమా సౌకర్యాన్ని మరింతగా విస్తరించడం సాధ్యమవుతుంది. 3. దేశంలో మౌలిక సదుపాయాల రంగం వృద్ధి కోసం అవసరమైన పెట్టుబడులను విదేశీ కంపెనీలు అందిస్తాయి. అలాగే ఈ సంస్థలు ఈ రంగం విస్తరణకు అవసరమైన నైపుణ్యాన్నీ, అనుభవాన్నీ తెస్తాయనేవి పాలకపక్షాల వాదనలుగా ఉన్నాయి. కానీ, నిజానికి మనదేశంలో నేడున్న ప్రభుత్వ రంగ బీమా వ్యవస్థ దేశంలో బీమా సదుపాయాన్ని మరింత మందికి చేర్చేందుకు విశేష కృషిచేస్తోంది. ఒక్క భారతీయ జీవిత బీమా సంస్థే తన బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమూ, బీమారంగ విస్తరణ కోసమూ సాలీనా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పైగా ఈ సంస్థ మన దేశీయ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం తన వద్ద ఉన్న వనరులను విశేషంగా మదుపుచేస్తోంది. కాగా, విదేశీ సంస్థల దృష్టి యావత్తూ తాత్కాలిక లాభాలపైనే ఉంటుందనేది మనం మరువరాదు. ఈ సంస్థలు మన దేశంలో పెద్ద స్థాయిలో ఉన్న దేశీయ ప్రజల పొదుపు మొత్తాలపై అదుపును సాధించేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాయి. పైగా, ఈ విదేశీ బీమా కంపెనీలు అందించగల కొత్త తరహా సేవలు కూడా ఏమీ లేెవన్నది వాస్తవం. 
అమెరికా అనుభవాలు
           మనం 1990వ సంవత్సరంలో అమెరికాలో బీమారంగంలోని సంస్థల దివాళాకు సంబంధించి ఏర్పడిన అమెరికా పార్లమెంటరీ సబ్‌కమిటీ నివేదిక సారాన్నే చూడవచ్చును. ఈ నివేదికకు ఆ కమిటీ ''విఫల వాగ్దానాలు'' అనే పేరు పెట్టింది. దాని ప్రకారం అమెరికాలో బీమారంగంలోని కంపెనీల దివాళాకు కారణాలుగా ఆ కమిటీ ఈ దిగువ అంశాలను పేర్కొంది : 1. (లాభాపేక్షతో) వెనకా ముందు చూసుకోకుండా విస్తరణకు పూనుకోవడం 2. ఇతర సంస్థలతో (అనారోగ్యకర) పోటీలో - ప్రీమియంలవంటి వాటిని తక్కువగా నిర్ణయించడం. 3. నిర్లక్ష్య పూరిత యాజమాన్యం 4. మోసపూరిత కార్యకలాపాలు 5. దురాశ, తదితరాలు. ఈ బీమారంగ సంస్థల దృష్టి యావత్తూ తాత్కాలిక లాభాలపైననే ఉందనీ, వాటికి దీర్ఘకాలిక దృక్పథం లేదనీ ఈ కమిటీ 1990లోనే తేల్చి చెప్పింది. కానీ, నేటివరకూ ఈ రంగంలోని అమెరికా సంస్థలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఆ కారణం చేతనే 2008 ఆర్థిక సంక్షోభంలో ప్రపంచంలోని అతి పెద్ద బీమా సంస్థ అయిన,అమెరికాకు చెందిన ''అమెరికన్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌్‌'' కూడా దివాళా బాట పట్టింది. నాడు, దానిని గట్టెక్కించేందుకు అమెరికా ప్రభుత్వం 17,000 కోట్ల డాలర్ల బెయిలవుట్‌ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో, నేడు పాలకులు బీమారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఒనగూరుతాయని చెబుతున్న ప్రయోజనాలకు సంబంధించిన అసలు నిజాలను మనం అవగతం చేసుకోవాలి.
భారతదేశంలో బీమారంగం
            మనదేశంలోని బీమారంగం 1956 జనవరిలో జాతీయం చేయబడింది. ఈ క్రమంలో భాగంగానే సుమారు 245 వివిధ సంస్థలను విలీనం చేసి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)ను ఏర్పాటు చేశారు. 1990ల చివరి వరకూ దేశంలోని బీమారంగంలో ఈ సంస్థదే సంపూర్ణ పాత్ర. కాగా, 1999లో సరళీకరణ విధానాలలో భాగంగా నాటి ప్రభుత్వం బీమారంగంలో 26 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించింది. అనంతర కాలంలో సుమారు 20కి పైగా బీమా కంపెనీలు దేశంలో కార్యకలాపాలను ఆరంభించాయి. ఈ రంగం తాలూకు ప్రైవేటీకరణకు సంబంధించిన తొలి దశాబ్దంలో దాని విస్తరణ 2001లోని 2.71 శాతం నుంచి 2009 నాటికి 5.20 శాతానికి గణనీయంగా పెరిగింది. అలాగే, ఈ కంపెనీల పాలసీదారులకు పెట్టుబడిపై లభించే ప్రతిఫలం సుమారు 35 శాతంగా ఉంది. కాగా, ప్రభుత్వ రంగ సంస్థలలో ఈ ప్రతిఫలం 20 శాతంగానే ఉంది. మరో రకంగా చెప్పాలంటే ఈ ప్రైవేటు కంపెనీలు తమ తొలి దశలో కొంతమేర ప్రజలలో ఆశలను రేకెత్తించాయి.
             కానీ, కాలక్రమేణా వీటి స్వభావాన్ని ప్రజలు చవిచూడసాగారు. ఫలితంగానే, 2012 నాటికి ఈ ప్రైవేటు బీమా కంపెనీల విస్తరణ వేగం 3.96 శాతానికి పడిపోయింది. అలాగే, వీటి శాఖలు 2011-13 కాలంలో 10 శాతం మేర తగ్గిపోయాయి. అంటే, ఆ కంపెనీల శాఖలు అనేకం మూతబడ్డాయి. 2011 మార్చి నాటికి 8,175గా ఉన్న ఈ కంపెనీల దేశవ్యాప్త శాఖలు 2012-13 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6,759కి తగ్గాయి. అదేకాలంలో ప్రభుత్వ రంగంలోని భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) శాఖలు 155 మేర పెరిగి 3,526కు చేరాయి. ఈ విధంగా ఇతరేతర గణాంకాలు కూడా మన ప్రభుత్వరంగ బీమా సంస్థల పట్ల ప్రజల విశ్వాసానికి కారణాలనూ, ఆధారాలనూ చూపగలవు. ఉదాహరణకు 2012-13 కాలంలో ఎల్‌ఐసి తాలూకు ప్రీమియం ఆదాయం 2.92 శాతం పెరిగింది. కాగా, అదే కాలంలో ప్రైవేటు రంగ కంపెనీల ఆదాయం 6.87 శాతం మేర తగ్గింది. పాలసీలు మురిగిపోవడం అనేది ఎల్‌ఐసిలో కేవలం 5.6 శాతంగా మాత్రమే ఉండగా, ప్రైవేటు రంగంలోని కంపెనీలలో (ఒక్క హెచ్‌డిఎఫ్‌సి మినహా) ఇది 17 శాతం నుంచి 42 శాతం వరకూ ఉంది. ఇక ''బీమారంగ నియంత్రణ, అభివృద్ధి అథారిటీ'' ప్రకారం 2012-13 కాలంలో దేశంలోని 23 ప్రైవేటు బీమా సంస్థలలో కేవలం ఐదు సంస్థల తాలూకు క్లైమ్‌ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి మాత్రమే 90 శాతానికి పైబడి ఉంది. ఈ కంపెనీలలో అత్యధికం 10 సంవత్సరాల పైబడి మనుగడలో ఉన్నవే. కాగా, ఎల్‌ఐసిలో ఈ క్లైమ్‌ సెటిల్‌మెంట్‌ నికరంగా (2014) 97.73 శాతంగా ఉంది. ప్రైవేటు కంపెనీల విషయంలో 2013 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లు 3.47 శాతంగా ఉండగా, ఎల్‌ఐసిలో ఇవి 1.04 శాతంగా మాత్రమే ఉన్నాయి. అంటే, పాలసీదారులకు ప్రయోజనకరంగానూ, అనుకూలంగానూ ఉండడంలో ప్రభుత్వరంగ సంస్థలదే పైచేయి. ఇక, 2013లో జీవిత బీమా రంగంలోని ప్రైవేటు కంపెనీలకు చెందిన ఏజెంట్ల
వార్షిక సగటు పాలసీల సంఖ్య మూడుగా మాత్రమే ఉండగా, ఇది ఎల్‌ఐసి ఏజెంట్ల విషయంలో 29గా ఉంది. ప్రజలలో ప్రభుత్వ బీమారంగం పట్ల ఉన్న విశ్వాసానికీ, ఆ రంగంలోని ఏజెంట్ల సమర్థతకు కూడా ఈ గణాంకాలు నిదర్శనమే.
ఆర్డినెన్స్‌ - చట్టం
           బీమారంగం ప్రైవేటీకరణ అనంతరం, గడిచిన దశాబ్దంన్నర కాలంలో భారత ప్రజలు విదేశీ ప్రైవేటు కంపెనీల తీరుతెన్నులను చాలా మేర తెలుసుకోగలిగారు. ఆ కారణం చేతనే వారు ప్రభుత్వ బీమా సంస్థలకు పట్టం కడుతున్నారు. ఆదరణ చూపుతున్నారు. విశ్వసిస్తున్నారు. మరి అటువంటప్పుడు, నేడు మన ఎన్‌డిఎ పాలకులు ఆర్డినెన్స్‌ల ద్వారా విదేశీ బీమా కంపెనీలకు ఎర్ర తివాచీలు పరవడం ఎందుచేత? పైగా, ఈ ఆర్డినెన్స్‌ల జారీ పద్ధతి కూడా, పెట్టుబడుల సమీకరణలో నికరమైనది కాకున్నా - ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంది? ఉదాహరణకు ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌, చట్ట రూపం తీసుకోవాలంటే పార్లమెంటు తదుపరి సమావేశాలలో ఈ ఆర్డినెన్స్‌ను (ఆరు వారాలలోపుగా) బిల్లు రూపంలో తేగలగాలి. మరి, ఈ విధమైన ప్రక్రియ పూర్తికాకుంటే అప్పటి పరిస్థితి ఏమిటి? దాని వల్ల ప్రస్తుత ఆర్డినెన్స్‌ చెల్లకుండా పోదా? అటువంటి స్థితిలో నేడు ఈ ఆర్డినెన్స్‌ను నమ్ముకుని బీమారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా వస్తాయి?
ఆర్డినెన్స్‌ ఉద్దేశం
          అంటే నేడు ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేయడంలో ప్రభుత్వం తాలూకు అసలు ఉద్దేశం వేరేదో ఉంది. అది, షేర్‌ మార్కెట్లకు సానుకూల సంకేతం ఇవ్వడం కావచ్చును..! లేదా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థల మెప్పు కోసం కావచ్చును!! లేదా త్వరలో మనదేశ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంతృప్తి పరిచేందుకు కూడా కావచ్చును!!! ఈ సందర్భంలో ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అయిన కౌసిక్‌ బసు చెప్పిన మాటలను ఉటంకించవచ్చును. ఆయన ప్రకారంగా : 'స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్థిక నమూనా' విఫలమయిందని ప్రపంచం అంతా దాదాపు ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది. కాగా, ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్లుగా మన పాలకులు మాత్రం చింకి పాతదైన పాత ప్రైవేటీకరణ, మార్కెట్‌ ఉదారవాదాన్నే పట్టుకుని వేలాడుతున్నారు.
- డి పాపారావు

No comments:

Post a Comment