Tuesday, December 30, 2014

ప్రపంచ దేశాలపై క్రూడ్‌ ఆయిల్‌ ధరల ప్రభావం

  ఈ సంవత్సరంలో జూన్‌ మాసం నుండి ప్రపంచ క్రూడ్‌ ఆయిల్‌, ముడి పెట్రోలు, ధరలు తగ్గడం ప్రారంభమైంది. క్రూడ్‌ ఆయిల్‌ ఒక బ్యారెలు 115 డాలర్లు నుండి ప్రస్తుతం 60 డాలర్లకు పడి పోయింది. సగానికి సగం క్రూడ్‌ ఆయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గింది. బ్రెంట్‌ ధర, నైమక్స్‌ ధర అని రెండు చోట్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నిర్ధారించబడుతాయి. మొదటిది లండన్‌ నగరంలో రెండవది న్యూయార్క్‌ మెటల్‌ ఎక్సేంజ్‌ బేస్‌ ధర (మార్కెట్‌ ధర) నిర్ధారణ ప్రతి రోజు జరుగుతుంది.బ్రెంట్‌ ధర సూచిక ఆధారంగా ఒపెక్‌ దేశాలు ఎగుమతులు చేస్తాయి. ఒపెక్‌
(అర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టియం కంట్రీస్‌), ఇది ఒక కార్టేల్‌గా వ్యవహరిస్తుంది. ధర మరియు క్రూడ్‌ ఆయిల్‌ సప్లరుని ఇది నిర్ధారిస్తుంది. ఈ సంస్థ 1960లో 5 దేశాలతో (ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, కువైట్‌ మరియు వెనిజులా) ప్రారంభమైంది. ప్రస్తుతం 12 దేశాలతో ఈ సంస్థ పనిచేస్తుంది. పశ్చిమ ఆసియా నుండి 6 దేశాలు (సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరిటస్‌, కథార్‌, ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌) 4.ఆఫ్రికా దేశాల (లిబియా, నైజీరియా, అల్జీరియా, అంగోలా) దక్షిణ అమెరికా నుండి రెండు దేశాలు. (వెనిజులా, ఇక్వెడార్‌) సభ్యులుగా ఉన్నారు. దీని ప్రపంచ కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది.
ఒపెక్‌ ధర మరియు సప్లరు నిర్ణయాలు 
              ప్రపంచం మొత్తం చమురు ఉత్పత్తుల్లో 40శాతం ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి చేస్తాయి. వీటిలో అత్యంత కీలకమైనది సౌదీఅరేబియా. రోజుకు ఒక కోటి బేరల్స్‌ ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ఒపెక్‌ దేశాల ఉత్పత్తులలో మూడో వంతు కేవలం సౌదీ అరేబియానే ఉత్పత్తి చేస్తుంది. ఒపెక్‌ సంస్థ అనేక రకాల ఒత్తిళ్ళకు లోనైంది.క్రూడ్‌ ఆయిల్‌ సప్లరులో కోత విధించడం ద్వారా మార్కెట్‌ ధర స్థిరీకరించ బడుతుందని వారి అభిప్రాయం. కాని, సౌదీ అరేబియా ఆయిల్‌ మంత్రి అలి అల్‌-నైమి ఆయిల్‌ ఉత్పత్తులు తగ్గించే ప్రసక్తే తలెత్తదని 27 నంవంబర్‌ వియన్నా ఒపెక్‌ సమావేశంలో నిర్ద్వందంగా ప్రకటించారు. ఆయిల్‌ మార్కెట్‌ తనంతట తానుగానే సరైన ధర నిర్ధారించటం జరుగుతుందని అల్‌-నైమి ప్రకటించాడు. ఏ సంస్థలైతే అధిక వ్యయంతో ఉత్పత్తి చేస్తాయో మరియు సరైన పెట్టుబడులు లేక ఉత్పత్తులు కొనసాగిస్తాయో ఆ వ్యాపార సంస్థలకు మార్కెట్‌ తగిన బుద్ధి చెబుతుందని అల్‌-నైమి ప్రకటించారు. మొత్తం ప్రపంచ క్రూడ్‌ ఆయిల్‌ సప్లరులో 40 శాతంగా కొనసాగుతున్న ఒపెక్‌ మార్కెట్‌ వాటాను కాపాడుకోవటం దిశగా ఈ నిర్ణయాలు జరిగాయి. అనగా ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తులను తగ్గించడానికి నిరాకరించాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధర ఇప్పుడిప్పుడే పెరిగే అవకాశం కాస్త వెనక్కి నెట్టబడింది.
ఆయిల్‌ ధరలు తగ్గడానికి కారణం ఏమిటి ?
                  ఆయిల్‌ ధరలు ఇంతగా పతనం అవడానికి కారణాలు ఏమిటి? ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నలు సాధారణంగా ఎవరికైనా రావొచ్చు. దీనికి రెండు రకాల కారణాలను చెప్పుకోవచ్చు. 1.ప్రపంచ వ్యాపితంగా క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2.అమెరికాలో 2008 నుండి ఏర్పడిన ఆర్థిక సంక్షోభ స్థితి, ప్రపంచ వ్యాపితంగా దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ బాగా తగ్గింది. క్రూడ్‌ ఆయిల్‌ అత్యంత కీలకమైన ఆర్థిక వనరు. దీని పై ఆధిపత్యం పొందడానికి అమెరికా తన సామ్రాజ్య వాద ధోరణితో పాలసీలను రూపొందించు కుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్‌ నిక్షేపాలు ఉండి అతి తక్కువ ఉత్పత్తి వ్యయంతో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి జరుగుతున్న గల్ఫ్‌ దేశాలలో ఏదో ఒక నెపంతో అమెరికా సైనిక జోక్యం చేస్తూనే ఉంది. ఆ దేశాలను తమ ఆధిపత్య ధోరణితో దిగ్భందించడం దాని ఉద్ధేశ్యం. క్రమంగా గల్ఫ్‌ దేశాలలోని ఆయిల్‌ పై పూర్తి నియంత్రణను సాధించాలనేదే దాని ఉద్ధేశ్యం.రెండవది తమ దేశంలోనే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉత్పత్తి చేయడం. ఈ రెండు విధానాలు అమెరికా సామ్రాజ్య వాదులు ఆయిల్‌ పై ఆధిపత్యం సంపాదించడానికి ఒక పథకం ప్రకారం అమలు చేయడం జరుగుతుంది. కాని అమెరికా సైనిక జోక్యంతో అస్తవ్యస్తం అయినప్పటికీ ఇరాక్‌ లిబియా దేశాలలో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తుల ఈ రెండు దేశాలలో మొత్తం రోజుకు 40 లక్షల బ్యారళ్ళ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. 
                     అంతర్గతంగా, షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో అమెరికా కంపెనీలు పెద్దఎత్తున పాల్గొంటున్నాయి. 2010 నాటికి 20,000 షేల్‌ ఆయిల్‌ బావులను నూతనంగా తొవ్వారు. సౌదీ అరేబియాతో పోల్చుకుంటే ఈ బావులు సంఖ్యలో పది రేట్లు అధికం. ఫలితంగా రోజుకు 90 లక్షల బ్యారల్స్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని అమెరికా చేస్తుంది.అనగా కేవలం 10 లక్షల బ్యారల్స్‌ మాత్రమే సౌదీ అరేబియా కన్న తక్కువ.దీంతో అమెరికా ఆయిల్‌ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2005లో అమెరికా 60శాతం తమ వినియోగ అవసరాలకై దిగుమతులు చేసుకోగా, 2013 నాటికి 33శాతానికి ఆయిల్‌ దిగుమతులు కుదించబడ్డాయి. ఈ రకమైన అంతర్గత క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి షేల్‌ ఆయిల్‌ ద్వారా అమెరికా సాధించింది. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ప్రక్రియలో రాతి పొరల నుండి నూతన సాంకేతిక పద్ధతి ద్వారా ఆయిల్‌ ఉత్పత్తి (ఎక్స్‌ట్రాక్ట్‌) చేయబడుతుంది. అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి సంస్థలు ప్రపంచ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు దరిదాపు 100 డాలర్లకు అటూఇటుగా కొనసాగుతుందనే అంచనాతో ఆయిల్‌ దాని సంబంధిత రంగాల పరిశ్రమల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అమెరికా మొత్తం పెట్టుబడు లల్లో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి రంగంలో11.4% పెట్టుబడి వాటా ఏర్పడింది.ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థలో ఆర్థిక మాద్యం కొనసాగుతూనే ఉంది. జపాన్‌ మొదలుకొని పశ్చిమ యూరప్‌ దేశాల్లో, నూతన పారిశ్రామిక దేశాల్లో (ఎమర్జింగ్‌ ఎకానమిస్‌) మాంద్యం స్థితి కొనసాగటం వలన ఆయా దేశాలలో ఆయిల్‌ దిగుమతులు చాలా వరకు పడిపోయాయి. ఈ స్థితిలో ఆయిల్‌ ఉత్పత్తి దేశాలు, ప్రధానంగా ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సప్లరుపై కోత విధించడానికి నిరాకరించాయి. అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది. అధిక ఉత్పత్తి వ్యయంతో కూడిన షేల్‌ ఆయిల్‌ కంపెనీలు దివాలాతీసే స్థితికి చేరే అవకాశం ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధర 60 డాలర్లకు ఒక బ్యారల్‌ కొనసాగితే షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కంపెనీలు దివాలా స్థితికి చేరుకుంటాయి. అంతే కాదు ఈ కంపెనీలకు రుణాలు అందించిన విత్త సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. 
ఆయిల్‌ ధరల ప్రభావం 
               ప్రపంచంలో కొన్ని దేశాలలోనే ఆయిల్‌ నిక్షేపాలు ఉన్నాయి వాటిలో కొన్ని. ప్రధానంగా గల్ఫ్‌ దేశాలు, అతితక్కువ ఉత్పత్తి వ్యయంతో ఆయిల్‌ ఉత్పత్తిని చేసే స్థితిలో ఉన్నాయి. సౌదీ అరేబియాలొ ఒక బ్యారల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి వ్యయం 6 డాలర్లకు మించదు.ఆయిల్‌ ఎగుమతులు చేసే కొన్ని దేశాలు, ఎగుమతుల ఆదాయంపై అత్యధికంగా ఆధారపడ్డాయి. ఈ దేశాలు ఎగుమతులపై వచ్చిన రాబడి ద్వారా తమ ఆర్థిక విధానాలను కొనసాగిస్తాయి. వీటిలో ఇరాన్‌, రష్యా, నైజీరియా, వెనిజులాలో ఎగుమతుల పై (క్రూడ్‌ ఆయిల్‌) తమ ఆర్థిక విధానాలను రూపొందించుకుంటాయి. ఈ దేశాలు మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర గణనీయంగా తగ్గడం ఆర్థిక ఇబ్బందులకు లోనుకావల్సి ఉంటుంది. ఈ దేశాలలో దీని ప్రభావం బహిర్గతం అవడం ప్రారంభమైంది, కరెన్సీ మారకపు రేటు దిగజారటం ప్రారంభమైంది. దీని వలన ఈ దేశాలు మరింతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే స్థితికి నెట్టవేయబడ్డాయి. రష్యా మినహా పైన తెలిపిన దేశాలు ఒపెక్‌లో సభ్యులే. అయిన ప్పటికీ ఒపెక్‌ నాయకత్వంలో ఉన్న సౌదీ అరేబియా నిర్ణయాలను వ్యతిరేకించటం వీరికి సాధ్యం కాదు. 
భారత ఆర్థిక వ్యవస్థపై ఆయిల్‌ ధరల ప్రభావం
              ఆయిల్‌ ధర సగానికి తగ్గడాన్ని అత్యధికంగా ఆయిల్‌ దిగుమతిపై ఆధారపడిన దేశాలు ఆహ్వానించాయి, ఈ స్థితి వారికి చాలా అను కూలంగా ఉంటుంది.ఇందులో ఒకటి భారతదేశం, అంతర్జా తీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధర గణనీయంగా పడిపోవటం వలన భారత ప్రభుత్వం తన విత్త లోటును (ఫిజికల్‌ డెఫిసిట్‌) తగ్గించ వచ్చని అంచనా వేసింది (4.7% నుండి 4.1% వరకు). దీంతో వెంటనే ఎన్‌డిఏ ప్రభుత్వం డీజిల్‌పై తమ అజమాయిషీని హడావిడిగా ఎత్తివేసి మార్కెట్‌ కంట్రోలుకు వదిలేసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు సగానికి సగం తగ్గినా భారత ప్రభుత్వం కేవలం మూడవ వంతు మాత్రమే వినియోగదారులకు బదిలీ చేసింది.మరో వైపు కేంద్ర ప్రభుత్వం తమ రాబడిని అధికం చేసుకునే ఉద్దేశంతో పెట్రోల్‌, డిజీల్‌ పై రూ|| 2:25 మరియు రూ||1:00 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని 12 నవంబర్‌ నుంచి పెంచింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు మాసాలకు గాను 1600 కోట్ల రూపాయలు వినియోదారులకు బదిలీ కాకుండా నిరోధించింది.పెట్రోల్‌ దానికి సంబంధించిన ఉత్పత్తు లపై గత ఆర్థిక సంవత్సరంలో (2013-2014) ఎక్సైజ్‌ సుంకం ద్వారా 1.79 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వసూలు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఆయిల్‌పై పన్నులుద్వారా 2.6 లక్షల కోట్లు గత సంవత్సరం పొందాయి.పెట్రోల్‌ డిజిల్‌ వంట గ్యాస్‌పై నియంత్రణ ఉపసంహరించుకోవడం వలన ప్రయివేటు రంగంలోని ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలకు అనుకూల పరిస్థితులు కల్పించింది. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పటికీ ఆ మేరకు ఎన్‌డిఏ ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు ధరలు తగ్గించ లేదు. ఇది ప్రజలను దగా చేయడమే.
- బి రాజేందర్‌

No comments:

Post a Comment