Tuesday, December 30, 2014

మేధావులు మౌనం వహించడం కాదు - మేధోమథనం జరగాలి

గత కొంత కాలంగా రాష్ట్రంలో మేధావులు మౌనం దాల్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ మౌనం కేవలం మేధావులకే పరిమితం కాకుండా ప్రజస్వామిక సంస్థలకు సంఘాలకు మౌనరాగం వర్తించేలా ఉంది. దశాబ్దకాలంపాటు ఉద్యమాల పునాదుల మీద ప్రజస్వామిక స్పూర్తిని చాటిన విసృత మేధోమథనాల చరిత్రను గత అరునెలల కాలంలో మేధావివర్గం మరిచినట్టు కన్పిస్తుంది. నూతనంగా పురుడు పోసుకున్న రాష్ట్రంలోనూ నిన్నటి మేధావుల
మథనం కొనసాగుతుందని అశించిన సగటు పౌరుల ఆశలు పూర్తిగా నెరవేరడం లేదు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో ఉధృతంగా వివిధ సమస్యల మీద, ప్రజల అకాంక్షల మీద జరగాల్సినంతగా చర్చ జరగడంలేదు. 
                     రాష్ట్రంలోని నూతన ప్రభుత్వం కొత్త తరహా అలోచనలతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది. ఇన్నాళ్లపాటు ఉన్న పాలనా వ్యవస్ధను సంపూర్ణంగా మార్చి నూతన పాలనా వ్యవస్థను, విధానాలను రూపొందించాలనే కాంక్ష నూతన ప్రభుత్వంలో చాల స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన నూతన పథకాలు, నిర్ణయాలమీద స్పందించినవారు కొంత మందే కనిపించారు. ప్రభుత్వాన్ని అభినందించడం ఇష్టం లేకపోవడం ఇందుకు కారణం అనుకుంటే. కనీసం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకి చేరడంలో ఇబ్బందికరమైన సందర్బాల్లోనూ మేధోవర్గం మౌనం వహించింది. ఉద్యమకాలంలో ప్రభుత్వాలు చేసిన ప్రతి పనిపైన చర్చను లెవనెత్తిన చాలమంది అప్పటి మేధావులు, సంస్థలు గత ఆరునెలలుగా కనీసం అనుకూలంగానో, వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోలేని అయోమయంలో పడట్టుగాఉన్నవి. ఇదివరలో రౌండు టేబుల్‌ సమావేశాలు, హాల్‌ మీటింగ్‌ లు, భారీ బహిరంగ సభలు - ఇలా పలు రకాలుగా ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసిన మేధావివర్గం ఆస్థాయిలో ఇప్పుడు పూర్తిగా స్పందించడం లేదు. అయితే మేధావుల మౌనం వీడడమంటే కేవలం ప్రభుత్వాలను, పార్టీలను విమర్శించాలని కోరుకోవడం కాదు. ప్రజల అకాంక్షలను ప్రభుత్వానికి చేర్చేందుకు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ఒపీనియన్‌ మేకర్స్‌గా పనిచేయాలని కోరుకోవడం అత్యాశ ఏమాత్రం కాదు. ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమమైన 'మిషన్‌ కాకతీయ' కావచ్చు లేదా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ లాంటి గుణాత్మక పరిణామాల మీద సైతం కనీస చర్చను చేపట్టలేకపోయారు. గత అనుభావాలు, అన్యాయాల గురించి విసృతంగా మాట్లాడిన వారు సైతం ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్లవచ్చో వివరిస్తూ కనీసం వారి ఆకాంక్షలను బహిరంగంగా వ్యక్త పరచకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. నూతన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అలోచనలతో విధాన రూపకల్పనకు మద్దతు ఇవ్వాల్సిన ప్రజాసంఘాలు ఇప్పటిదాకా ఆవైపుగా విస్తృతమైన చర్చను ఇంకా ప్రారంభించలేదు. ఉద్యమానికి కేంద్రంగా అనేక కార్యక్రమాలకి, చర్చలకి కేంద్రగా ఉన్న తెలంగాణ జెఏసి ఏన్నికల తర్వతా దాదాపుగా ఉనికిని కోల్పోయిందనేది వాస్తవం. దీంతో పాటు ప్రజల అకాంక్షలకు అద్దంపట్టిన విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం సొంత అవకాశాల ఆరాటంలో మునగడమే ఇందుకు కారణమనే మాట కొంత కటువుగానే ఉంటుంది. ''తెలంగాణ కోసం పోరాటం చేశాం కాబట్టి మావాటాగా మాకేదైనా దక్కా''లనే అరాటం దాదాపు అన్ని ప్రజా సంఘాల నాయకులల్లో కనిపిస్తున్నది. ఈ అభిప్రాయాలను విద్యార్ధి సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు వ్యక్తిగత లక్ష్యాలకోసం పనిచేస్తున్నందునే వచ్చిన తెలంగాణాకు భవిష్యత్‌ దర్శనం చేయాల్సిన వీరు అవసరమైనంత మేరకు చర్చను చేయలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు చాల మంది ఉద్యమనేతలు, ప్రజాసంఘాల నాయకులు అటు టిఆర్‌ఏస్‌ లోనో, లేక కాంగ్రెస్‌ లాంటి పార్టీల్లో చేరడంతో పాటు, మిగిలిన వారు సైతం నూతన ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవుల కోసమో, లేదా ఆధికారిక పనుల కోసమో జూన్‌ రెండుకు ముందున్న ఉత్సాహన్ని చూపిస్తున్నట్టుగా లేదు. ఉద్యమకాలంలో విద్యార్దులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాయర్లు ఇలా ప్రతి రంగంలోని నిపుణులు ఉద్యమజెండా ఎత్తిన వారే ఉద్యమ సమయంలో ''తెలంగాణ వస్తుంది, వచ్చిన తెలంగాణలో అద్బుతమైన అభివృద్ధి అవుతుం''దని తమ విజన్‌ ప్రకటించిన వారే. అయితే తెలంగాణ రాగానే తమ బాధ్యత అయిపొయిందనుకుంటున్నారో లేక ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిన నాయకుడే ప్రభుత్వాధినేతగా ఉన్నారన్న నమ్మకమో కానీ ఇన్నాళ్లు తాము చేసిన ఆలోచనలకు కాస విరామం ప్రకటించినట్టుగా తోస్తున్నది. ఉద్యమ నాయకుడు ఎంతగా డ్రైవింగ్‌ సీటులో ఉన్నప్పటికీ, విధానాల రూపకల్పనలో మేధావులు పాలుపంచుకోవడం ద్వారా మరింత మంచే జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా మేధావులు, ఉద్యమకారులు తమ అలోచనలను చర్చకు పెట్టాలి. మరింత వేగంగా ప్రజల అకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయాలి, ఒకవేళ ప్రభుత్వం వాటిని స్వీకరించదేమో అన్న అనుమానం ఉంటే కనీసం ప్రజల్లో చర్చకైనా తేవాలి. ప్రజలు అకాంక్షలను ప్రభుత్వాలు ఖచ్ఛితంగా స్వీకరిస్తాయన్న ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాన్ని నమ్ముతూ, సాకారమైన తెలంగాణ కలను సంపూర్ణం చేసేదిశగా ముందుకు కదలాలి. తెలంగాణ సమాజానికి ఆదినుంచి ఉన్న చైతన్యాన్ని సజీవంగా నిలుపుతూ నవ తెలంగాణ నిర్మాణానికి మేధావివర్గం మౌనం వీడి మాట్లాడ్డం ప్రారంభించాలి. మంచిని మంచిగా, చెడుని చెడుగా నిర్బయంగా వ్యక్తపరచగలిగే స్పూర్తి కలిగిన సమాజాన్ని వాంఛించే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. తెలంగాణ ప్రజలకు సమాజానికి మేధావులు మౌనం కాదు. మేధోమథనం కావాలి, అవకాశాల ఆరాటం కాదిప్పుడు, ప్రజల అవసరాలు తీర్చే అలోచనలు కావాలి. పదవులపై వ్యామోహం కాదిప్పుడు - ప్రభుత్వాన్నికి మార్గదర్శనం చేసే మాటలు కావాలి.
-మాణిక్య మహేశ్‌ 
(వ్యాసకర్త: జర్నలిజం రీసెర్చ్‌ ఫెలో)

No comments:

Post a Comment