Thursday, November 20, 2014

పుతిన్‌ ప్రతిఘటన!


                                       జి-20సమావేశాలు పూర్తికాకమునుపే వ్లాడీమీర్‌ పుతిన్‌ బ్రస్‌బేన్‌ నుంచి మాస్కో పయనమయి తన నిరసనను చెప్పకనే చెప్పాడు.  రష్యాకు ఏది హితమో దానినే ఆచరించటానికి పుతిన్‌ నిర్ణయించుకున్నాడు తప్ప  జి-20దేశాధినేతలు ఆశించినవిధంగా ఆయన వ్యవహరించదలచలేదని ఆయన  అర్ధంతర నిష్క్రమణతో అర్థమవుతోంది.

                       ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బెన్‌లో జరిగిన జి-20 సమావేశంలో పశ్చిమ దేశాల నాయకులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వ్యవహరించిన తీరు అత్యంత దురహంకారపూరితంగానే కాకుండా జుగుప్సాకరంగా కూడా ఉన్నది. పుతిన్‌ ఆస్ట్రేలియాలో అడుగిడింది మొదలు అర్ధంతరంగా
ఆ సమావేశాన్ని వీడినదాకా అవమానాల పరంపర కొనసాగింది. ఒక దేశాధ్యక్షుడిగా వ్లాడీమీర్‌ పుతిన్‌ ఆస్ట్రేలియాలో అడుగిడగానే ప్రొటోకాల్‌ ప్రకారం ఆ దేశ ప్రధాని, సమావేశ వేదికైన బ్రిస్‌బేన్‌ నగరం భాగంగా ఉన్న క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రధాని ఆయనకు స్వాగతం పలకాల్సి ఉండగా ఆస్ట్రేలియా రక్షణ శాఖలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తితోపాటుగా ఆ రాష్ట్ర గవర్నర్‌ స్వాగతం పలికారు.

                     శనివారంనాడు కెనడా ప్రధాని హార్పర్‌ పుతిన్‌తో మాట్లాడుతూ 'నేను మీతో కరచాలనం చేయవలసిరావచ్చు. అయితే నేను మిమ్ము లను ఒకటి అడగదలిచాను: ఉక్రెయిన్‌ నుంచి వైదొలగండి' అని అనటం జరిగింది. దీనికి వేరెవరయినా అయివుంటే 'నీ సంగతి నువ్వు చూసుకో, హార్పర్‌' అని ఉండేవాడు. కానీ పుతిన్‌ దానికి సమాధానంగా 'దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాదు. ఎందుకంటే మేము అక్కడ లేము' అని అన్నాడు. 

                     ఆ తరువాత శుక్రవారంనాడు స్వతహాగా భయస్తుడై బ్రిటీష్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తన మీడియా సమావేశంలో రష్యాను నాజీ జర్మనీతో పోల్చాడు: 'ఉక్రెయిన్‌లో రష్యా చర్యలు అంగీకరింపదగినవి కావు. ఐరోపా ఖండంలో ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశాన్ని బెదిరించటం కుదరదు. దీని పర్యవసానాలు గతంలో చూశాం. మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటివి మరలా జరగకుండా చూసుకోవాలి' అని పేర్కొన్నాడు.
                     మరీ గతంలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఈ మధ్యకాలంలో పెద్ద దేశాలు చిన్న దేశాలను అదిరించి బెదిరించిన సంఘటనలను ఆయన ఉదాహరిస్తే సరిపోయేది. 2003లో అమెరికా, బ్రిటన్‌లు ఇరాక్‌పై దాడిచేసి వేలాది ప్రజల మరణాలకు కారణభూతమయి ఆ దేశాన్ని ఆక్రమించిన విషయం, నాటో దళాలు లిబియాపై బాంబుల వర్షం కురిపించి ఆ దేశ నాయకుడు ముహమ్మద్‌ గడ్డాఫీని హత్యగావించిన విషయం, సిరియా అధ్యక్షుడు అస్సద్‌ను కూలదోయటానికి చాందసవాద కిరాయి సైనికులను అమెరికా, బ్రిటిష్‌ ప్రభుత్వాలు పంపిన విషయం-వీటిలో ఏ ఒక్కటైనా ప్రజలకు గుర్తుండి ఉంటుందని కామెరాన్‌ అనుకున్నా అలా మాట్లాడి ఉండే వాడు కాదు. 
అసలు అమెరికా కుట్రతోనే రష్యా నుంచి ఉక్రెయిన్‌ను దూరం చేయటానికి ఒక                      సంక్షోభం సృష్టించబడింది. పుతిన్‌ని అవమానించటానికి జరిగిన ప్రయత్నంలో ఒబామా కూడా ఒక చెయ్యి వేశాడు. క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఇలా చెప్పాడు: 'ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దురాక్రమణ ప్రపంచానికి ప్రమాదం ఎందుకంటే కూల్చివేయబడిన ప్రయాణీకుల విమానంలో చాలా మంది అమాయకులు బలయ్యారు. వారిలో మీ దేశస్థులు కూడా ఉన్నారు'. ఇది చదువుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా లేదూ? 
                     వీటన్నింటికీ సమాధానంగా జి-20సమావేశాలు పూర్తికాకమునుపే వ్లాడీమీర్‌ పుతిన్‌ బ్రస్‌బేన్‌ నుంచి మాస్కో పయనమయి తన నిరసనను చెప్పకనే చెప్పాడు.రష్యాకు ఏది హితమో దానినే ఆచరించటానికి పుతిన్‌ నిర్ణయించుకున్నాడు తప్ప జి-20దేశాధినేతలు ఆశించినవిధంగా ఆయన వ్యవహరించదలచలేదని ఆయన అర్ధంతర నిష్క్రమణతో అర్థమవుతోంది. అమెరికా, యూరోపియన్‌ దేశాలు ఉక్రెయిన్‌కు నిజంగా సహాయం చేయదలుచుకుంటే ప్రపంచ పెట్టుబడి మార్కెట్‌ను రష్యన్‌ బ్యాంకులకు అందుబాటులో లేకుండా ఎలా చేస్తారు? రష్యన్‌ బ్యాంకులు దివాళా తీయాలని ఆ దేశాలు భావిస్తున్నాయా? అదే జరిగితే ఉక్రెయిన్‌ కూడా దివాళా తీస్తుంది. వారు ఏం చేస్తున్నారో వారికి తెలుస్తున్నదా? రాజకీయాలు వారిని గుడ్డివారిగా మార్చాయా?-ఇలా పుతిన్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు చరిత్రలో ఎలాంటి సమాధానాలు దాగి ఉన్నాయో రాబోయే కాలం వెల్లడిస్తుంది. 
                     బ్రిస్‌బేన్‌లో జరిగిన జి-20సమావేశంలో పుతిన్‌ అరుదైన రీతిలో సంయమనం పాటించటానికిగల కారణం గురించి రష్యా వార్తా పత్రిక ఇజ్వెస్తియా ఇలా వివరించింది: 'అమెరికా విహరిస్తున్న 'ఏక దృవ' ప్రపంచ స్వప్నం విఫలమయిందని, ఆ దేశం పశ్చిమ నాగరికత అనే నౌకను చైనా అనే పర్వతం వైపుగా నడుపుతున్నదని, ప్రస్తుత పాలకులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ నౌక ఆ పర్వతాన్ని ఢకొీనటం అనివార్యమని పుతిన్‌కు తెలుసుగనుకనే ఆయన అంతగా సంయమనం పాటించాడు'.

No comments:

Post a Comment