- సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్, 2014 నవంబర్ 16.
తీర్మానం
విద్యా ఉద్యోగాల్లో దేశమంతటికీ రాజ్యాంగం నిర్ధిష్టపర్చిన రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన చట్టాల మేరకు మహిళలు, బిసి,మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితం అయ్యాయి.ప్రభుత్వ రంగం క్రమంగా కనుమరుగవుతూ ప్రయివేట్ రంగం బలపడ్తున్న నేటి దశలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అర్ధం లేకుండా పోయింది. కనుక ప్రయివేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను
సవరించాల్సిన సమయం నేడు ఆసన్నమైంది.
దేశవ్యాపితంగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ వీలైనంత వేగంగా ప్రయివేటీకరించాలని ప్రభుత్వాలు కంకణం కట్టున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలోని ప్రభుత్వ వాటాలను ప్రయివేట్ వారికి అమ్మడానికి ఒక మంత్రిత్వశాఖనే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దేశ ప్రజల అకుంఠిత శ్రమతో ఎదిగి దేశాభివృద్ధికి ఎంతో దోహదపడిన సంస్థలు ఉనికిలో లేకుండా పోతున్నాయి. ప్రజలందరికీ ఉపయోగపడవలసిన భూమి,నీరు,గాలి ఆకాశం వంటి ప్రకృతి వనరులపై సమస్త హక్కులను ప్రభుత్వాలు కొన్ని ప్రయివేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు అతి కీలకమైన రంగాలను, లాభాలను ఆర్జించే సంస్థలను కూడా ప్రయివేటీకరింస్తున్నారు. విద్యా,వైద్యం,రైల్వేలు వంటి ప్రాథమిక రంగాలను సేవారంగాలను కూడా ప్రయివేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు.వాటికి అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలే సమకూర్చుతున్నాయి. ప్రయివేట్ కంపెనీలు నామమాత్రపు పెట్టుబడితో ప్రజల సంపదపై పెత్తనం చేస్తూ వేల కోట్ల లాభాలను మూటకట్టు కొంటున్నాయి. ప్రజా సంపదతో జాతీయ వనరుతో లాభాలు దండుకుంటున్నా రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను అమలు చేయడానికి అది కుంటిసాకులు చెప్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల తమ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గిపోతోందని ప్రతిభ లేని వారు ఉద్యోగాల్లోకి వస్తారని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రిజర్వేషన్లను అమలు చేసిన ప్రభుత్వరంగ సంస్థలకు అసలు సామర్థ్యమే లేదన్నట్లు బుకాయిస్తున్నారు.అద్భుత విజయాలు సాధించిన సంస్థలు తమ దగ్గర పని చేయడానికి ఐఐటి,ఐఐఎం తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వారినే ఎంచుకొంటారు.ఈ సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతున్న సంస్థలే. ఆ సంస్థల నిర్వహణకు అయ్యే భారాన్ని దేశ ప్రజలందరూ మోస్తున్న నిజాన్ని గమనంలోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లను ఎన్నికల హామీగా ప్రకటించడానికి ఉత్సాహం చూపే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తమ హామీని మర్చిపోతున్నాయి.ప్రభుత్వరంగం వేగంగా ప్రయివేటీకరించబడుతున్న నేడు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల కల్పనను ఎంత మాత్రం వాయిదా వేయడానికి వీలులేదు. ఇందు కోసం పార్లమెంట్‌లో చట్టం చెయ్యాలి. ఈ చట్టం సాధన దిశగా వెంటనే అన్ని పార్టీలు తమ వంతు కృషి మొదలు పెట్టాలని, త్వరగా చట్టం చేయాలని ఈ సదస్సు డిమాండ్ చేస్తోంది.

No comments:
Post a Comment