గెలిచినా, ఓడినా వామపక్షాలు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాయని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. అసెంబ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడి తిరిగి మూడున్నరకు సమావేశమైంది. అంతకు ముందు డిఎల్‌ఎఫ్ సంస్థకు భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి 'కాలింగ్ అటెన్షన్' క్రింద మాట్లాడారు. దాన్ని కొనసాగించాలా లేక పెన్షన్లకు సంబంధించిన 'ఆసరా'పై చర్చించాలా అనే అంశంపై స్పీకర్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సున్నం రాజయ్య
మాట్లాడారు. 'ఆసరా' ఆందోళనకరంగా ఉందని, ఉదయం నుంచి తన నియోజకవర్గం నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. దీనిపై సభలో చర్చ జరగాలని చెప్పారు. కాలింగ్ అటెన్షన్‌పై తర్వాత చర్చ జరపాలని సూచించారు. ఆయన మాట్లాడుతుండగానే టిడిపికి చెందిన ఓ సభ్యుడు ప్రభుత్వ తొత్తులు అని వ్యాఖ్యానించారు. దీంతో సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరు తొత్తులు. పనికిరాని విషయాలపై మీరు మీరు కొట్లాడుకుంటున్నారు. జనం సమస్యల్ని చర్చించమంటే తొత్తులంటారా' అని మండి పడ్డారు. వామపక్షాలు గెలిచినా, ఓడినా ప్రజల పక్షానే ఉంటా యని, ఆసరాపై చర్చించాలని చెప్పారు. సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైసిపి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆసరా పథకంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినమేరకు భూముల సమస్యను బిజెపి ఫ్లోర్‌లీడర్ లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముందుకు తెచ్చారు. ఆసరా సమస్యను వాయిదా వేయాలని కోరారు. దీనిపై కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. తమపై ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని టిడిపి, కాంగ్రెస్ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

No comments:
Post a Comment