తేది : 11.11.2014
రాష్ట్రంలో గల 31.67 లక్షల మంది పెన్షన్‌దార్లకు చెల్లింపులు ప్రతి నెలా చేయాలని, తమ పేర్లు జాబితాలో లేవని నిరాశచెంది మరణిస్తున్న వృద్దులను రక్షించడానికి పెన్షన్ జాబితాలలో అర్హులందరి పేర్లు ప్రకటించాలని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
గతంలో పెన్షన్ పొందుతున్నవారందరికీ నెలకు వృద్దులకు రు.1000, వికలాంగులకు రు.1500 పెన్షన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వృద్దులంతా ఉత్సాహం పొందారు. ప్రభుత్వంపై ఆశ పెట్టుకున్నారు. ఆగష్టు 19న చేసిన సర్వేలో కొంత మంది పేర్లు నమోదు కాలేదు. ఆ నమోదుకాని వారి పేర్లు పెన్షన్ మంజూరి జాబితాలో రాలేదు. కొంత మందికి
ఆధార్‌కార్డు అనుసంధానం చేయడంతో ఆధార్‌లేనివారి పేర్లు పెన్షన్ జాబితాలో రాలేదు. ఈ విధంగా సెఫ్టెంబర్ 1 నాటికి ప్రభుత్వం మొత్తం పెన్షన్‌దార్లలో 26.95 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు ప్రకటించింది. 4.72 లక్షల మందికి పెన్షన్లు అందనట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి. నవంబర్ 8వ తేదీన నల్గండ జిల్లా యాదగిరిగుట్టలో కందుకూరి బాలయ్య (83), 10వ తేదీన వరంగల్ జిల్లా కొడకండ్లలో పసునూరి అచ్చమ్మ (70) తమ పేర్లు లేవని హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో వచ్చే రు.200 కూడా రాకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఎందరు ఆర్హులున్నా ఒకరికి మాత్రమే పెన్షన్ అన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో చాలా మంది పెన్షన్‌దారులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు కూడా అనుమానాలను నివృత్తి చేయడం లేదు. పెన్షన్‌దారులంతా ‘ఆసరా’ లేనివారే. ఇంతకాలం ప్రభుత్వంపై ఆధారపడి బ్రతుకుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే పరిశీలించి అర్హులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి. గ్రామ సర్పంచ్ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా సమాచారాన్ని సేకరించి అర్హతగలవారందరికీ పెన్షన్లు ఇవ్వాలి. వృద్దులు, వికలాంగులు, అనాధలు, వితంతువులు, చేతివృత్తుల వారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. త్వరపడి వారి పేర్లను తొలగించడం ద్వారా గాని, జాబితాలో లేకపోవడం ద్వారాగాని వారిని నిరాశకు గురికాకుండా చూడాలి. గ్రామ, మండల యంత్రాంగాన్ని బాధ్యత వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జాబితాల్లో పేర్లు రానివారిని గుర్తించి వారికి కూడా పెన్షన్ చెల్లించే ఏర్పాటు చేయాలి.

No comments:
Post a Comment