Friday, November 28, 2014

బంగారు తెలంగాణగా.. మార్చే శక్తి కెసిఆర్‌కు లేదు తమ్మినేని

                రాష్ట్రాన్ని పాలించే శక్తి, బంగారు తెలంగాణగా మార్చే తాహతు కెసిఆర్‌ ప్రభుత్వానికి లేదని తేలిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఐదు నెలల కాలంలోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన విధానం ప్రజలకు అర్థమైందన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ఆ అంశాన్ని ప్రస్తావించడం గాని, వారి కుటుంబాలను పరామర్శించిన పరిస్థితీ లేదని విమర్శించారు. రైతులను ఉద్దరిస్తామన్న ప్రభుత్వం వారి గురించి ఎందుకు పట్టించుకోవడం
లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు భూములు ఇస్తున్నామని ప్రకటిస్తున్న కెసిఆర్‌కు దళితులకు పంపిణీ చేసేందుకు భూమి దొరకడం లేదా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజల ఓట్లతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని రద్దు చేస్తే వారిని గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా పోరాడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. ప్రజల కన్నీరు, కష్టాలు తీర్చే తెలంగాణ సాధన కోసం ఉద్యమించాలని, తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సీనియర్‌ నాయకులు నర్రా రాఘవరెడ్డి, పెన్నా అనంతరామశర్మ, జహంగీర్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment