ఈ నేపథ్యంలో వామపక్షాల స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు ద్విముఖ సవాళ్లను తిప్పికొట్టడం పెద్ద సవాలే. అందుకోసం ఇప్పటి వరకూ అనుసరించిన ఎత్తుగడలను, విధానాలను పరిశీలించుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన సామాజిక ఆర్థిక పరిస్థితుల పట్ల సవ్యమైన అంచనాకు రావాలి. అభివృద్ధి నిరోధక దాడి పెరిగిన ఈ సమయంలో అన్ని విమర్శలూ పరిశీలించవచ్చు. వాస్తవానికి మహాసభ ముసాయిదా ప్రకటించినప్పుడు ఎవరైనా తమ సలహాలు, సూచనలు పంపించవచ్చు. ఆ పిమ్మటే నూతన విధానం రూపొందుతుంది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 21వ మహాసభలకు విశాఖపట్టణంలో జయప్రదంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సభలకు సంబంధించిన లోగోను ఇటీవలే బివి రాఘవులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) అంతర్గత చర్చల గురించి, విధానాల మథనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉద్యమాలూ,
విధానాలపై సమీక్షలు జరుగుతున్న మాట నిజమనీ, విభేదాలు, పదవులకు సంబంధించిన కథనాలు ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. మామూలు సందర్భాల్లో కమ్యూనిస్టులకు, వారి ఉద్యమాలకు ప్రచారం ఇవ్వని బడా మీడియా వ్యతిరేక దిశలో మాత్రం తాడూ బొంగరం లేని కథలు గుప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఓటములు ఎదురైనప్పుడు లేదా రాజకీయంగా ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ ఊహాగానాలకు పట్టపగ్గాలుండవు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టు పదజాలంతోనే మాయాజాలం చేయగల మాజీలు ఈ విషయంలో మరింత ముందుంటారు. ఎంతో బాధతో, బాధ్యతతో హితబోధ చేస్తున్నట్టు కనిపిస్తూ గతం గురించి స్వంత కవిత్వాలు, వింత సిద్ధాంతాలు గుప్పిస్తుంటారు. లోగో విడుదలకు కాస్త ముందే అలాటి ఒక కు వ్యాఖ్యాత సిపిఐ(ఎం) కార్యకర్తలకు స్వర్ణోత్సవ 'అభినందనలు' అంటూ మొదలు పెట్టి 'నాయకత్వం నియంతృత్వం' అంటూ అరిగిపోయిన పాత రికార్డును అఖరులో వేశారు. ఇలాటి 'శ్రేయోముఖ హేయ సఖులకు' ఎంత విలువివ్వాలో అందరికీ తెలుసు.
రాజకీయాల్లో ఇష్టానుసారం రంగులు మార్చడం గాక ఒక మూల సూత్రానికి కట్టుబడివుండేవారు ఆ పరిధిలో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఎవరో నాయకుడు అప్పటి అధికార వ్యూహాల మేరకు ఆదేశాలిస్తే సరిపోతుందనుకుంటే తర్జనభర్జనతో పని ఉండదు. జయాపజయాలు, అనుకూల ప్రతికూలతలు ఎలా ఉన్నా కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని ప్రజలు భావిస్తారు. ఉండాలని ఆశిస్తారు. కనుకనే నిర్మొహమాటంగా, నిర్దిష్టంగా చర్చించడం, ఇతరులపై విమర్శతో పాటు ఆత్మవిమర్శ కూడా చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఎన్నికల్లో సిపిఐ(ఎం) చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా తొమ్మిది లోక్‌సభ స్థానాలకు పడిపోయింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ వికృత నిర్బంధ పాలన సాగుతుండగా మొన్నటి ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బిజెపి ఓటింగు గణనీయంగా పెరిగింది. దేశంలో సిపిఐ(ఎం) ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల సంఖ్య, ఉన్న ప్రతినిధుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఈ పరిస్థితికి కారణాలేమిటో సమీక్షించుకుని పురోగమించేందుకు మార్గాలు అన్వేషించాలని కమ్యూనిస్టు అభిమానులే గాక ప్రజాస్వామ్య ప్రియులందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సిపిఐ(ఎం) గత కేంద్ర కమిటీ సమావేశంలో పొలిట్‌బ్యూరో తరపున ప్రధాన కార్యదర్శి సమర్పించిన పత్రంతో పాటు సభ్యులు సీతారాం ఏచూరి, బివి రాఘవులు కూడా తమ పత్రాలు చర్చకు పెట్టారని వార్తలు వచ్చాయి. సమావేశానంతరం ఈ విషయమై ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన మరో అయిదు పత్రాలు కూడా కేంద్ర కమిటీ సభ్యుల నుంచి వచ్చాయని వివరించారు. చారిత్రిక పరిస్థితులు మారినపుడు ముఖ్య నాయకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గతంలోనూ జరిగింది. 1979లో జనసంఘం ప్రాబల్యంలోకి వెళ్లిన జనతా ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చడం సరైందా, కాదా అన్న చర్చ జరిగింది. అప్పటి పశ్చిమ బెంగాల్ సిపిఐ(ఎం) కార్యదర్శి ప్రమోద్ దాస్‌గుప్తా దానిపై తీవ్ర సవాలు విసురుతున్నారని నాటి పత్రికలన్నీ కోడై కూశాయి. (ఇంకా ఛానళ్లు రాలేదు). దాన్ని అప్పట్లో జులై సంక్షోభం అని పిలిచేవారు. 1982లో విజయవాడలో సిపిఐ(ఎం) మహాసభ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశాలన్నీ ఈ ప్రశ్నతోనే నడిచేవి. చివరకు ఆ సభలు బ్రహ్మాండమైన ప్రదర్శన, బహిరంగసభలతో గొప్పగా ముగిశాయి. అంతకు ముందు పుచ్చలపల్లి సుందరయ్య అసమ్మతి పత్రం సమర్పించడంపై బోలెడు దుమారం నడిచింది గాని ఆయన చివరి శ్వాస వరకూ సిపిఐ(ఎం) అగ్రనేతగానే ఉన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రధాని పదవి తీసుకోకపోవడం చారిత్రిక తప్పిదమని వ్యాఖ్యానించిన జ్యోతిబాసు ఆ తర్వాత ఓపికున్నన్నాళ్లు చురుగ్గా పనిచేస్తూ వచ్చారు. అంతర్గత కారణాల వల్ల చర్యకు గురైన కేరళ నేత అచ్యుతానందన్ ఇప్పటికీ శాసనసభలో ఎల్‌డిఎఫ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అసలు కమిటీలకు విలువ లేకుండా ఎవరు ఉండాలో అధ్యక్షులే నిర్ణయించి అక్కడ ఏం తీర్మానించాలో కూడా శాసించే బడా పార్టీల ధోరణికి భిన్నమైన ప్రజాస్వామ్య పద్ధతి ఇది. కమ్యూనిస్టు పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండదని వాదించే వారికి ఇలాటి వాస్తవాలతో పనిలేదు. ఈ చర్చలన్నీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలన్న అంశంపై తప్ప ఎవరు పదవుల్లోకి రావాలన్న ఝంఝాటం కాదు.
యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సిపిఐ(ఎం) ప్రస్థానంలో విజయాలు చాలా సార్లు చెప్పుకున్నవే. ప్రపంచంలోనే అత్యధిక కాలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం, ఏక కాలంలో మూడు రాష్ట్రాలను పాలించడం, కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వాల స్థాపనలో కీలక పాత్ర వహించడం ఇదంతా తెలిసిన విషయమే. ప్రజాఉద్యమాల్లోనూ వామపక్షాలతో కలసి అదెప్పుడూ ముందుంటుందని అందరూ అంగీకరిస్తారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కూడా ప్రభావశీలంగా మిగిలిన కమ్యూనిస్టు పార్టీల్లో అదొకటి. పాలక వర్గాలను కచ్చితంగా ప్రతిఘటించడం దాని పుట్టుకకు ప్రాతిపదిక. మరో దేశాన్ని మక్కికీ మక్కి అనుకరించడం గాక భారత దేశ పరిస్థితులకు నిర్దిష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అన్వయించడం సిపిఐ(ఎం) మార్గదర్శక సూత్రం. బిజెపి బలం పెరిగేకొద్దీ మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలను కూడగట్టడం, ప్రాంతీయ పార్టీలను సమీకరించడం ప్రధాన అవసరంగా తయారైంది. 1990లలో, 1996లో ఈ ప్రయత్నం మంచి ఫలితాలిచ్చింది కూడా. ఈ కాలంలోనే కార్పొరేట్ సరళీకరణ విధానాలు కూడా పరాకాష్టకు చేరడంతో ప్రాంతీయ పాలక పక్షాలు కూడా సహజంగానే ఆ బాట పట్టాయి. కాంగ్రెస్ అవకాశవాద విధానాలు, అవినీతి కారణంగా బిజెపి గెలవగలిగింది. దాన్ని దింపడం కోసం వామపక్షాలు యుపిఎకు మద్దతు నిచ్చినా కొన్ని ప్రజానుకూల పథకాలు సాధించడం కొంత ఉపయోగపడింది. అణు ఒప్పందం తర్వాత అదీ మారిపోయింది. 2009లో కాంగ్రెస్ మరోసారి విజయం తర్వాత అవినీతి వ్యవహారాలతో పరిస్థితి దిగజారి నరేంద్ర మోడీ స్వంతంగా మెజారిటీ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తర్వాతి పరిణామాలు చూస్తున్నవే.
ఈ నేపథ్యంలో వామపక్షాల స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు ద్విముఖ సవాళ్లను తిప్పికొట్టడం పెద్ద సవాలే. అందుకోసం ఇప్పటి వరకూ అనుసరించిన ఎత్తుగడలను, విధానాలను పరిశీలించుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన సామాజిక ఆర్థిక పరిస్థితుల పట్ల సవ్యమైన అంచనాకు రావాలి. అభివృద్ధి నిరోధక దాడి పెరిగిన ఈ సమయంలో అన్ని విమర్శలూ పరిశీలించవచ్చు. వాస్తవానికి మహాసభ ముసాయిదా ప్రకటించినప్పుడు ఎవరైనా తమ సలహాలు, సూచనలు పంపించవచ్చు. ఆ పిమ్మటే నూతన విధానం రూపొందుతుంది. ఇదంతా ఒక ప్రక్రియ. ఈ మధ్యలోనే కొంతమంది కమ్యూనిస్టు పరిభాషలోనే వంకర టింకర వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతా కమ్యూనిస్టులదే తప్పయినట్టు, వారు దిగజారిపోయినట్టు శాపనార్థాలు పెడుతుంటారు. ఆత్మవిమర్శ అన్న పదాన్నే అపహాస్యం చేసే వారుంటారు. కమ్యూనిస్టులలో మేధావులు ఎక్కువ గనకే అతిగా చర్చిస్తుంటారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కాలమిస్టు రాశాడు. వాస్తవానికి కమ్యూనిస్టులతో ఉండాల్సిన మేధావులు అనేక మంది జీవన పోరాటంలో చిక్కుకుపోతుంటారు. అయినా వారు అభిమానం నిల్పుకోవడం గొప్ప విషయం.. చెప్పాలంటే తెలుగుదేశం, టిఆర్‌ఎస్ వంటి పార్టీల తరపున కనిపించే చాలామంది పూర్వాశ్రమంలో నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన వారన్నది వాస్తవం. పశ్చిమ బెంగాల్‌లో కిషన్‌జీ వంటివారిని మమతా బెనర్జీ మార్క్సిస్టులకు వ్యతిరేకంగా ఉపయోగించుకుని మట్టుపెట్టిన తీరు కూడా ఇటీవలి అనుభవమే. గతంలో కంభంపాటి సత్యనారాయణ, మద్దుకూరి చంద్రశేఖరరావు, కడియాల గోపాలరావు వంటి వారెందరో మలిదశలో ఉద్యమాలలో క్రియాశీలంగా లేరు. అంతకు ముందు తాము ముఖ్య నాయకులుగా ఉన్నాం గనక గతం గురించి అవాస్తవాలు చెప్పి గజిబిజి పర్చే ప్రయత్నం వారెన్నడూ చేయలేదు. కానీ ఒక తెలుగు వ్యాఖ్యాత మాట్టాడితే సుందరయ్య, బసవపున్నయ్య అంటూ అర్థసత్యాలు గుమ్మరించడం పనిగా పెట్టుకున్నారు. అయినా ఆశయాన్ని బలపర్చే అభిమానులు విస్తారంగా ఉండబట్టే ఇన్ని అవరోధాల మధ్యనా, దుష్ప్రచారాల మధ్యనా వామపక్ష పార్టీలు నిలబడగలుగుతున్నాయి. 2002లో హైదరాబాదులో జరిగిన మహాసభల తర్వాత బిజెపిని ఓడించడంలో కృతకృత్యమైనట్టే ఇప్పుడు విశాఖ మహాసభలు కూడా మతోన్మాదాన్నీ, సరళీకరణనూ దీటుగా తిప్పికొట్టే విధానాన్ని రూపొందిస్తాయని ఆశించవచ్చు. అదే సమయంలో స్వతంత్ర పాత్రను పెంచడం, పోరాటాలను పదునెక్కించడం, వామపక్ష ఐక్య కార్యాచరణను ముందుకు తీసుకుపోవడం వంటి అనేక కర్తవ్యాలకు కూడా ఈ సభలు దిశానిర్దేశం చేయడం తథ్యం.
- తెలకపల్లి రవి
No comments:
Post a Comment