Saturday, November 22, 2014

అసెంబ్లీ సమావేశాల తీరుపై వామపక్ష పార్టీల అసంతృప్తి...

                 
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరుపై వామపక్ష పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రజా సమస్యలపై సరైన చర్చ జరపకుండా, ఒకరిపై మరొకరు అభియోగాలు చేసుకుంటున్నారని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ప్రభుత్వ తీరు మారాల్సిందేనని అభిప్రాయపడింది. చర్చకు రాని రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలు : తమ్మినేని తెలంగాణలోని రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడంపై లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. 29 వరకు జరిగే సమావేశాల్లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలపై చర్చించి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, రైతుల చావుల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చూపే ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే వ్యవసాయ సమస్యల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని నిరూపించాలని తమ్మినేని సవాల్ విసిరారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలి : చాడా డిమాండ్  రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయని ఆశించిన రైతాంగానికి ఆశాభంగం కలిగిందని అన్నారు. రైతుల చావులు ప్రభుత్వ హత్యలే  : గోవర్ధన్..ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా చూడాలని, రైతుల చావులు ప్రభుత్వ హత్యలే అని న్యూడెమోక్రసీ కార్యదర్శి గోవర్థన్‌ అన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలోనే 80 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీసం వారి కుటుంబాలను అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారాయన. ఇప్పటికైనా ప్రభుత్వం తీరులో మార్పు రాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని వామపక్ష నేతలు హెచ్చరించారు. 

No comments:

Post a Comment